: నిఠారి సీరియర్ కిల్లర్ కోలికి 12న ఉరిశిక్ష
నిఠారి హత్య కేసులో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలికి ఈ నెల 12న ఉరి శిక్ష అమలు కానుంది. దీంతో నిన్నటిదాకా ఘజియాబాద్ జైలులో ఉన్న కోలిని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అధికారులు మీరట్ జైలుకు తరలించారు. 14 ఏళ్ల రింపా హాల్దార్ అనే బాలికను అతికిరాతకంగా హత్య చేసిన క్రమంలో 2006లో నిఠారి మారణ హోమం వెలుగు చూసింది. ప్రభుత్వ ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ, పలు దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను వెలికి తీసింది. రింపా హాల్దార్ కంటే ముందు 15 మంది చిన్నారి బాలికలను కూడా కోలి హతమార్చాడు. బాలికలను మచ్చిక చేసుకునే కోలి, వారిపై అత్యాచారం చేసిన తర్వాత హత్య చేస్తూ వచ్చాడు. హత్య చేసిన బాలికల మృతదేహాలను తాను నివాసం ఉండే ఇంటి పక్కనే గుట్టుచప్పుడు కాకుండా పడేసేవాడు. దర్యాప్తు చేపట్టిన సీబీఐ, అంతకుముందు అతడి చేతిలో హతమైన బాలికలకు చెందినవిగా భావిస్తున్న పుర్రెలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన ఘజియాబాద్ సెషన్స్ కోర్టు కోలికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే కోలి, అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అక్కడా కోలికి ఎదురుదెబ్బే తగిలింది. తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించిగా, కోలి మరణ శిక్షకు అర్హుడేనంటూ కింద కోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయినా ఆశ చావని కోలి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. అయితే అత్యంత పాశవికంగా చిన్నారి బాలికలను హతమార్చిన కోలికి క్షమాభిక్ష ప్రసాదించరాదంటూ కేంద్ర హోం శాఖ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రాజ్ నాథ్ సింగ్, ప్రణబ్ కు సూచించారు. దీంతో ప్రణబ్ కోలి విన్నపాన్ని తిరస్కరించారు. దీంతో కోలికి మరణశిక్ష విధించేందుకు ఘజియాబాద్ కోర్టు బుధవారం వారెంట్ జారీ చేసింది. ఘజియాబాద్ జైలులో ఉరిశిక్ష అమలు చేసే సౌకర్యాలు లేని నేపథ్యంలో మీరట్ జైలులో కోలికి శిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ‘‘ఈ నెల 12న కోలికి మరణశిక్షను అమలు చేయనున్నాం. నియమ నిబంధనల మేరకే కోలికి మరణ దండన అమలు చేస్తాం’’ అని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్.హెచ్.ఎం.రిజ్వి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. కోలికి ఉరిశిక్ష అమలుతో మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి మరణదండనగా ఈ కేసు నమోదు కానుంది.