: ఆ ముద్దు ఖరీదు 150 మిలియన్ డాలర్లా?
హాలీవుడ్ హీరో డెంజిల్ వాషింగ్టన్ కాపురానికి ఓ ముద్దు ఇప్పుడు పెద్ద ముప్పు తెచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే, మొన్నామధ్య మాలిబులో ఓ ప్రైవేట్ పార్టీలో ఒక అనామక అందమైన యువతికి డెంజిల్ వాషింగ్టన్ గాఢచుంబనం ఇచ్చాడు. మీడియా వాళ్లు ఊరుకుంటారా? ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేశారు. అంతే... కాపురంలో చిచ్చు రేగింది. అతని భార్య పౌలెట్ అగ్గి మీద గుగ్గిలమయ్యింది. ఇలాంటి పార్టీల్లో ఏం జరుగుతాయో నాకు తెలీదనుకోకండి అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటోంది. 1983లో 'విల్మా' సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి పార్టీలోనే తాను వాషింగ్టన్ కు పరిచయమైన విషయం గుర్తు చేసుకుంది. ఈ పార్టీల ముచ్చట్లు ఎంత వరకు వెళ్తాయో తనకి తెలుసని ఆమె స్పష్టం చేస్తోంది. 2003లో కూడా 'అవుట్ ఆఫ్ టైమ్' సినిమా షూటింగ్ సందర్భంగా సామాలాథన్ ను వాషింగ్టన్ ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కూడా పౌలెట్ నానాయాగీ చేసి, ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఊరుకుంది. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదని అంటోంది. దీంతో ఆమె కోర్టుకెక్కితే ఎంత నష్టపరిహారం చెల్లించాలనే దానిపై పరిశీలకులు లెక్కలు కూడా వేశారు. ఆమె కోర్టుకెళ్లి విడాకులు కోరితే వాషింగ్టన్ కనీసం 150 మిలియన్ల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, ఫలితంగా ఆయన రోడ్డునపడే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో ఔరా, ముద్దు ఎంత పని చేసింది? ఓ ముద్దు ఖరీదు 150 మిలియన్ డాలర్లా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.