: అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం చేయాలి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ ను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రేషన్ కార్డులు, పింఛన్లలో అనర్హులను ఏరివేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన అన్నారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిరంతరం సాగాల్సిన ప్రక్రియ అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి అర్హులందరికీ అందేలా సమర్థవంతంగా అమలు చేద్దామని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత ఉండాలని చంద్రబాబు అన్నారు.