: అమెరికా వాసులను అలరించిన శోభారాజు సంగీత విభావరి
అమెరికాలోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు అన్నమాచార్య ‘పద సంకీర్తనా పూలజల్లు’ను కురిపించారు. డల్లాస్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టాంటెక్స్ పాలక మండలి, శోభారాజు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. చిన్నారులు ఆలపించిన తిరుమల గిరిరాయ, నువ్వంటే ఇష్టం హనుమ, అన్నమ గాయత్రి, వేడుకొందామా వెంకటగిరి వంటి కీర్తనలు అతిథులను అలరించాయి. సాంస్కృతిక వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద స్వాగతోపన్యాసంతో శోభారాజు సంగీత విభావరి ప్రారంభమైంది. కొండలలో నెలకొన్న, నారాయణ సుగుణ బ్రహ్మం, నేను లేకుంటే స్వామి ఏడీ, బ్రహ్మమొక్కటే... కీర్తనలతో ప్రేక్షకులను మైమరిపించారు. అన్నమాచార్య సంకీర్తనలు, అన్నమయ్య భావ వాహిని, టీటీడీతో తన అనుబంధాన్ని ఆమె సభికులతో పంచుకున్నారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు యు.నరసింహారెడ్డి, పూర్వాధ్యక్షులు గవ్వా సంధ్య, దాతలు నూతి శాంతి, ముప్పిడి మంజుల శోభారాజును సత్కరించారు.