: సొంత జట్టు వికెట్ కీపర్ ను భయపెట్టిన డేల్ స్టెయిన్
దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ మైదానంలో కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఎప్పుడూ ప్రత్యర్థులను భయపెట్టే ఈ రియల్ పేసర్ ఈసారి సొంతజట్టు వికెట్ కీపర్ నే భయభ్రాంతులకు గురిచేసి, అంతలోనే అక్కున జేర్చుకున్నాడు. సెప్టెంబర్ 2న ఆస్ట్రేలియాతో ముక్కోణపు సిరీస్ వన్డే మ్యాచ్ సందర్భంగా... స్టెయిన్ విసిరిన బంతిని ఆసీస్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ బలంగా కొట్టే ప్రయత్నంలో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేతికి చిక్కాడు. క్యాచ్ పట్టిన వికెట్ కీపర్ ఆ ఆనందాన్ని బౌలర్ తో పంచుకోవడం సర్వసాధారణం. డికాక్ కూడా అలాగే స్టెయిన్ వద్దకు వచ్చాడు. కానీ, ఈ పేసర్ ముఖంలో చండ్రనిప్పులు కురిపిస్తూ, తీవ్రవ్యాఖ్యలు చేస్తూ ముందుకు రావడంతో, పాపం, డికాక్ బిక్కచచ్చిపోయాడు. అయితే, వెంటనే స్టెయిన్ తన సహచరుడిని దగ్గరకు తీసుకుని అనునయించాడు. అంతలో, కెప్టెన్ హషీమ్ ఆమ్లా, ఇతర ఆటగాళ్ళు కూడా అక్కడికి వచ్చి వారితో కలిసి వికెట్ ఆనందాన్ని పంచుకున్నారు.