: అలా చెప్పడం ద్రావిడ్ ను చూసే నేర్చుకున్నా: ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడాడు. 'లేదు', 'కాదు' అన్న విషయాలను మర్యాదపూర్వకంగా, ఎవరినీ నొప్పించని రీతిలో ఎలా చెప్పాలన్న విషయాన్ని తాను ద్రావిడ్ నుంచే నేర్చుకున్నానని తెలిపాడు. ద్రావిడ్, సచిన్, అమితాబ్ లు తన రోల్ మోడళ్ళుగా ఎందుకు మారారోనని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటానని పేర్కొన్నాడీ జార్ఖండ్ డైనమైట్. తన భార్య సాక్షి గురించి చెబుతూ, క్రికెటర్ గా తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని ఆమెకు తొలినాళ్ళలోనే విడమర్చి చెప్పానని తెలిపాడు. ఆమె తనను చేపలు తినమని కోరుతుందని, కానీ, అవంటే తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. ఇక, మద్యం విషయానికొస్తూ... చేదుగా ఉంటుందని, అందుకే మద్యం తాగనని స్పష్టం చేశాడు. కెప్టెన్సీపై మాట్లాడుతూ, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం తనకు ఇష్టం ఉండదన్నాడు. టీమిండియా మంచి స్థితిలో ఉన్నప్పుడు తప్పుకుంటానని తెలిపాడు. సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ హోదా అందుకోవడాన్ని మర్చిపోలేనని పేర్కొన్నాడు.