: భారత్ ను హెచ్చరించిన బ్రిటిష్ ఇంటెలిజెన్స్
మరోసారి ముంబై తరహా ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందంటూ భారత్ ను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు రాజ్య కాంక్షతో రగిలిపోతున్నారని, ముస్లింలు అధికంగా ఉండే భారతదేశం వైపు వారు చూస్తున్నారని, పాక్ లో వేళ్లూనుకోవడం ద్వారా భారత్ లో ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని మదర్సాల ద్వారా తమ కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసే ప్రమాదముందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదర్సాలపై నిఘా పెడితే ముందుగా అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. భారత్ లోని ప్రాముఖ్యత కలిగిన పురాతన కట్టడాలను నేలమట్టం చేసే అవకాశముందని, ముంబై తరహా దాడులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదముందని వారు సూచిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ప్రవర్తనతో పాశ్చాత్య దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రక్తం రుచి మరిగిన పులుల్లా తమ వర్గం కాని వారందరినీ చంపే సంస్కృతి ఐఎస్ఐఎస్ సభ్యులది. మనిషి భీతితో పారిపోతుంటే అతని రక్తం కళ్ల చూడడం వారికి వినోదం. ప్రాణంకోసం అర్థిస్తున్న వారిని కర్కశంగా చంపడం వారికి ఆట. ప్రాణాన్ని రక్షించుకునేందుకు పారిపోతున్నవారిని వెంటాడి వేటాడి గుళ్ల వర్షం కురిపించడం వారికి సరదా. వారు విడుదల చేసిన ప్రతి వీడియో వారి మానసిక స్వభావాన్ని కళ్లకు కడుతుంది. అలాంటి ఐఎస్ఐఎస్ భారత్ లో ప్రవేశించకుండా అడ్డుకోగల సామర్థ్యం మనకు ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.