: శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించవద్దు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రెస్ కోడ్ అమలు చేయాలని భక్తులు అంటున్నారు. వీఐపీ, స్పెషల్ దర్శనానికి, ఆర్జిత సేవలకు హాజరయ్యే భక్తులకు ప్రస్తుతం డ్రెస్ కోడ్ అమల్లో ఉంది. అలాగే, 50 రూపాయల సుదర్శనానికి కూడా ఇప్పుడు టీటీడీ అధికారులు డ్రెస్ కోడ్ ను అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, అన్ని దర్శనాలకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాక, విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేస్తే మంచిదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవారి సన్నిధిలో జీన్స్ ప్యాంట్, టీషర్ట్ లాంటి పాశ్చాత్య వస్త్రధారణ తగదని వారంటున్నారు. భారతీయ సంప్రదాయానికి తగ్గట్టుగా పురుషులు పంచె, ధోతీ, మహిళలు చీర, చుడీదారుల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ అధికారులు డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.