: నిన్నటి దాకా తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి!
‘నాపై రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా’ అంటూ ఓ మేధావి చేసిన వ్యాఖ్య టీమిండియా కెప్టెన్ కి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే, పోయినచోటే వెతుక్కోవాలి అన్నట్టు ఇంగ్లండ్ లో పోయిన పరువును అక్కడే దక్కించుకున్నాడు. టెస్టు ఫార్మాట్ లో ఘోర పరాజయంతో తీవ్ర విమర్శలపాలైన ధోనీ అసహనంతో సహచరులపై విరుచుకుపడేవాడు. మిస్టర్ కూల్, కూల్ కెప్టెన్, క్రియేటివ్ కెప్టెన్ అనే పేర్లతో పిలిపించుకున్న ధోనీ టెస్టుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక చతికిలపడ్డాడు. దీంతో ధోనీ టైం అయిపోయిందని అతనిని కెప్టెన్ గా తొలగించాలని, వారసుడ్ని వెతకాలని సీనియర్లు సలహాలు ఇచ్చారు. దీంతో ధోనీ సహచరులు ఆడకపోతే తానేం చేయగలనంటూ అసక్తత వ్యక్తం చేసేవాడు. దీనికి తోడు టెస్టుల్లో భారత్ ర్యాంకింగ్ దారుణంగా పడిపోయింది. ఇక టీమిండియా సొంత గడ్డపైనే పులి అనే విమర్శలు మొదలయ్యాయి. మరో వైపు కెప్టెన్, కోచ్ మారాలంటూ సెగ, దీంతో ఆటగాళ్లలో నిస్తేజం గమనించిన బీసీసీఐ రవిశాస్త్రిని డైరెక్టర్ గా నియమించింది. అతని స్ఫూర్తితో భారత్ ఆటగాళ్లు వన్డేల్లో రెచ్చిపోయారు. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుని సత్తా చాటారు. వన్డే సిరీస్ సాధనలో ఆటగాళ్లంతా సమష్టిగా రాణించడం విశేషం. చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్లే ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించడం విశేషం. దీంతో భారత జట్టు రెండు దశాబ్దాల తరువాత వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ లో సాధించిందని, అత్యధిక వన్డే విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ధోనీ ఖ్యాతిని ఆర్జించాడని విమర్శకులు, సీనియర్లు, వెటరన్ లు ధోనీని ఆకాశానికెత్తేస్తున్నారు. గతంలో విమర్శించిన వారే తనను పొగడ్తల్లో ముంచెత్తడంతో ధోనీ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే టెస్టుల్లో విఫలం పట్ల మాత్రం సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.