: కేంద్ర మంత్రి సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం


అవినీతి, బ్లాక్ మార్కెటింగ్ వంటి జాడ్యాలను దూరంగా ఉంచాలని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులకు పదే పదే గుర్తుచేస్తుంటారు. బ్లాక్ మార్కెటింగ్ కారణంగా దేశ ప్రజలకు నిత్యావసరాలు అందడం లేదని ఆయన గతంలో పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెటింగ్ కు వ్యాపారులు పాల్పడితే వారిని కటకటాల వెనక్కి నెడతామని ప్రకటించారు కూడా. అయితే తాజాగా కేంద్ర మంత్రి సమక్షంలోనే బీహార్ ముఖ్యమంత్రి జతిన్ కుమార్ మాంఝి బ్లాక్ మార్కెటింగ్ కు వత్తాసు పలుకుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తో పాటు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చిన్న చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం నేరం కాదని అన్నారు. వారిపై తమ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోదని సెలవిచ్చారు. తమ జీవనస్థాయి పెంచుకోవడం, పిల్లలను బాగా చదివించుకోవడం కోసం చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడతారని, అలాంటి వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి అవాక్కయ్యారు.

  • Loading...

More Telugu News