: ప్రేమ వివాహం చేసుకుందని చెల్లెలి గొంతు కోసిన అన్న
పరువు హత్యల రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పులివెంకటరెడ్డి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తమ పరువు ప్రతిష్ఠలు మంటగలిపి ప్రేమవివాహం చేసుకుందనే కారణంతో ఓ అన్న తోడబుట్టిన చెల్లెలి గొంతు కోశాడు. రాణి అనే యువతి ఆరునెలల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఆమె అన్న వారి వివాహాన్ని జీర్ణించుకోలేక ప్రతీకారం తీర్చుకునేందుకు అదను కోసం వేచి చూశాడు. ఈ ఉదయం ఆటోలో స్నేహితుడితో పాటు వచ్చిన అన్న, చెల్లెలి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన రాణి తేరుకుని అరిచేలోపు అతను ఆటోలో పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కొసం గాలిస్తున్నారు. గత నెలలో గుంటూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఓ తల్లిదండ్రులు కన్నకూతురినే మంచానికి ఉరేసిన సంగతి తెలిసిందే.