: అమెరికాలో మోడీ సభకు 'లాటరీ సిస్టం' పెట్టాల్సి వచ్చింది!
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఒబామా సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28న న్యూయార్క్ లోని సుప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో మోడీ పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం లాటరీ విధానాన్ని పాటించాలని నిర్వాహకులు నిర్ణయించారు. మోడీని కలిసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండడంతో, ఎవరిని ఆహ్వానించాలన్న విషయం అమెరికా వర్గాలకు తలనొప్పిగా మారింది. దీంతో, ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు పంపాలని సూచించారు. సోమవారం అర్థరాత్రి నాటికి 20,000 అప్లికేషన్లు వచ్చాయట. వాటిలో అలాస్కా, హవాయి దీవుల నుంచి వచ్చిన దరఖాస్తులు కూడా ఉండడం విశేషం. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ సీటింగ్ సామర్థ్యం 20 వేలకు మించకపోవడం కూడా లాటరీ విధానం అమలుకు ఓ కారణం. సాధారణ వ్యక్తులు అప్లికేషన్లు పంపుకునేందుకు సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఆ లోపు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. అమెరికాలోని 407 ఇండో-అమెరికన్ ఆర్గనైజేషన్లకు చెందిన సభ్యులు దరఖాస్తులు పంపుకునేందుకు మాత్రం ఈ సోమవారంతో గడువు ముగిసింది. దీనిపై వారు మాట్లాడుతూ, మోడీ ప్రజాదరణ దృష్ట్యా 60,000-70,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. పెద్ద మైదానాల కోసం ప్రయత్నించినా, అవి అప్పటికే బుక్కయిపోయాయని, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఒక్కటే ఖాళీగా ఉందని తెలిపారు.