: క్రికెటర్ అవుతానంటే మా నాన్న అడ్డుపడ్డాడు: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్


తొలిసారి ఇండియాకు వచ్చిన పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ మీడియా సమావేశంలో సరదా సరదాగా గడిపాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఉల్లాసంగా బదులిచ్చి నవ్వులు పూయించాడు. క్రికెట్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ప్రాణమని బోల్ట్ చెప్పాడు. తన తండ్రి కూడా క్రికెట్ ఆటకు వీరాభిమాని అని పేర్కొన్నాడు. కానీ, ఆయన వల్లే క్రికెటర్ కాలేకపోయానని బోల్ట్ తెలిపాడు. పదో తరగతి అయిపోయిన తర్వాత క్రికెట్, అథ్లెటిక్స్ లో ఏదో ఒకదాన్ని మాత్రమే కెరీర్ గా ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చి డైలమాలో పడ్డానని బోల్ట్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకోమని తండ్రి బలవంతం చేశాడని బోల్ట్ చెప్పుకొచ్చాడు. అథ్లెటిక్స్ లో బాగా పరిగెడితే చాలు... కెరీర్ అద్భుతంగా ఉంటుందని... అదే, ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలంటే ప్రతిభ ఉన్నప్పటికీ అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తన తండ్రి సలహా ఇచ్చాడని బోల్ట్ పేర్కొన్నాడు. తన రికార్డులు ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయని (100,200మీటర్ల రేసులో బోల్ట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు), వాటిని బద్దలుకొట్టడం ప్రస్తుతానికి అసాధ్యమని బోల్ట్ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో తన రికార్డులు ఎవరైనా బద్దలుకొట్టాలనుకుంటే విపరీతమైన హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని బోల్ట్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News