: మరో అమెరికన్ జర్నలిస్టు తల నరికేసిన ఇరాకీ మిలిటెంట్లు


సిరియా, ఇరాక్ లలో నరమేధం సృష్టిస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్లు తాజాగా మరో అమెరికన్ జర్నలిస్టును అత్యంత దారుణంగా హత్య చేశారు. గతంలో అమెరికన్ జర్నలిస్టు ఫూలేను హత్య చేసిన తరహాలోనే రెండో అమెరికన్ జర్నలిస్టు స్టీవెన్ సాట్లాఫ్ ను తల నరికేసి హత్య చేశారు. తాజా ఉదంతానికి సంబంధించిన వీడియోను మిలిటెంట్లు మంగళవారం విడుదల చేశారు. కొంత కాలం క్రితం సాట్లాఫ్ ను అపహరించిన మిలిటెంట్లు, తమపై అమెరికా దాడులను నిలపకపోతే, అతడిని హత్య చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక తమపై దాడులను తగ్గించేలా అమెరికాను ఒప్పించాలని కూడా మిలిటెంట్లు సాట్లాఫ్ పై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగని మిలిటెంట్లు సాట్లాఫ్ తల్లిని కూడా అపహరించి, అమెరికా వైఖరిలో మార్పు వచ్చేలా యత్నించాలని, లేనిపక్షంలో సాట్లాఫ్ ను హత్య చేస్తామని బెదిరించారు. అయితే అమెరికా వైఖరిలో మార్పు తెచ్చేంత హోదాలో తన కుమారుడు లేడని, అతడిని విడుదల చేయాలని సాట్లాఫ్ తల్లి, మిలిటెంట్లను వేడుకున్నారు. అయితే మిలిటెంట్లు ఆమె వినతిని మన్నించలేదు. సాట్లాఫ్ ను అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశారు. తాజా ఘటనపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దారుణానికి పాల్పడిన సందర్భంగా జర్నలిస్టు తలను నరికేసిన మిలిటెంట్, నేరుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘అయామ్ బ్యాక్ ఒబామా, ఇస్లామిక్ రాజ్యాల పట్ల మీరు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగానే మళ్లీ రావాల్సి వచ్చింది. మేం చేసిన తీవ్ర హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ మోసుల్ డ్యాంపై మీరు కొనసాగిస్తున్న దాడులే అందుకు నిదర్శనం’’అని మిలిటెంట్ వ్యాఖ్యానించాడు. ‘‘మాపై మీ క్షిపణులు దాడులు చేస్తున్నంత కాలం మీ పౌరుల పీకలను మా కత్తులు తెంచుతూనే ఉంటాయి" అని కూడా ఆ మిలిటెంట్ హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News