: 2జీ నిందితులతో సీబీఐ డైరెక్టర్ భేటీ!: కోర్టుకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడి
2జీ స్పెక్ట్రం కేసు నిందితులతో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పలుమార్లు భేటీ అయ్యారని, ఈ నేపథ్యంలో కేసు కొంతమేర నీరుగారిపోయిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. సీబీఐ డైరెక్టర్ ను ఆయన అధికారిక నివాసంలోనే కేసులో నిందితురాలిగా నిలిచిన రియలన్స్-అడాగ్ ప్రతినిధులు పలుమార్లు భేటీ అయ్యారని భూషణ్ ఆరోపించారు. ‘‘అడాగ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్థాయి అధికారులు ఏడాదిలో ఏకంగా 50 సార్లు సీబీఐ డైరెక్టర్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే అడాగ్ కంపెనీపై కేసు నీరుగారిపోయింది. ఇందుకు డైరెక్టర్ అధికార నివాసం వద్ద సందర్శకుల జాబితానే నిదర్శనం’’ అంటూ ప్రశాంత్ భూషణ్ కోర్టుకు చెప్పారు. ఈ తరహా కేసుల్లో ఏకంగా సీబీఐ డైరెక్టరే ఇలా నిందితులతో భేటీ కావడం తప్పుడు సంకేతాలను పంపినట్టేనని భూషణ్ ఆరోపించారు. అయితే స్వాన్ టెలికాం అధినేత షాహిద్ బల్వా తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలాని, భూషణ్ ఆరోపణలను ఖండించారు. సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా, ఇప్పటిదాకా పనిచేసిన సీబీఐ డైరెక్టర్లందరిలోకి నీతివర్తనుడని, నిజాయతీపరుడని జెఠ్మలాని కోర్టుకు తెలిపారు. భూషణ్ ఆరోపణలను సీబీఐ కూడా తిప్పికొట్టింది. నిరాధార ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ భూషణ్, సీబీఐ సంస్థ ప్రతిష్ఠను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది.