: కమిటీ వేయడం... నివేదిక బుట్టదాఖలు చేయడం... ఎందుకీ కమిటీలు?
ప్రజల నుంచి ఆందోళనలు రేగిన ప్రతిసారీ ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులుపుకుంటుంది. అధ్యయనం చేస్తున్నాం, పరిష్కరిస్తామని చెప్పడం ప్రభుత్వాలకు పరిపాటి. ఇక్కడి నుంచి ప్రభుత్వ గారడీ మొదలవుతుంది. ఐదు లేక ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ వేస్తారు. ఓ నెలా రెండు నెలలపాటు అధ్యయనం పేరిట వారిని పరిచయం లేని, భాష రాని ప్రాంతాలకు పంపుతారు. దీంతో తమ భాష కమిటీ సభ్యులకు రాకపోయినా ప్రజలు వినతి పత్రాలు ఇస్తారు. తమ గోడు వెళ్లబోసుకుంటారు. ఏదో చేయాలని చెబుతారు. కమిటీ ఓపిగ్గా అందరి బాధ వింటుంది. తాము చేసిన పరిశోధన ఫలితాన్ని ప్రభుత్వానికి అందిస్తుంది. మేము చేసింది ఇది అని ప్రజలకు చెబుతుంది. దీంతో కొత్త వివాదం మొదలవుతుంది. ఇంతలో ప్రభుత్వం తాను చేయాల్సిన పనిని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తుంది. గతంలో శ్రీకృష్ణ కమిటీ, తాజాగా శివరామకృష్ణన్ కమిటీల నివేదికలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఈ రెండు కమిటీలు నివేదికలు విడుదల చేసిన తరువాత కొత్త వివాదాలు రేగాయి. కమిటీ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. దీంతో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు కమిటీలు వేయడం ఎందుకు? అవి ఇచ్చే నివేదికలు బుట్టదాఖలు చేయడమెందుకు? అని పౌరులు ప్రశ్నిస్తున్నారు. వారి నివేదికలకు విలువ లేనప్పుడు ప్రజాధనాన్ని వృధా చేయడమెందుకని నిలదీస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం రాజకీయ నాయకులకు లేదా? అని మండిపడుతున్నారు. ప్రజాసమస్యలపై వేసిన ఏ కమిటీ నివేదికనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో భవిష్యత్ లో కమిటీ అంటే అపహాస్యం చేసే పరిస్థితి నెలకొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.