: ఈ ప్యూను మహా ఘటికుడు సుమా!
మనం చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలను బట్టి ఆఫీసు ప్యూను అంటే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి అని ఓ అంచనాకు వస్తాం. కానీ, మధ్యప్రదేశ్ లోని ఓ ప్యూను మాత్రం తద్విరుద్ధంగా కోట్లకు పడగలెత్తి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 30 ఏళ్ళుగా ప్యూను ఉద్యోగం చేస్తున్న కుల్ దీప్ యాదవ్ అనే ఈ వ్యక్తికి ఓ డ్యూప్లెక్స్ బంగ్లా, ఐదు పెద్ద ఇళ్ళు, లగ్జరీ కార్లు, నగదు, పలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అధికారులు జరిపిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అతని ఆస్తులపై దాడులు జరిపిన అధికారులు నివ్వెరపోయారు. ఓ ప్యూనేంటీ? కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టడమేంటీ? అని విస్మయం చెందారట. ఈ ఉదయం జరిపిన దాడుల్లో ఇవన్నీ బట్టబయలు కాగా, సాయంత్రం మరిన్ని దాడులు నిర్వహించనున్నామని, అప్పుడు మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. అతని నెల జీతం రూ.20 వేల కంటే ఎక్కువ ఉండదని, ఈ జీతంతో 30 ఏళ్ళలో మహా అయితే రూ.15-17 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కుల్ దీప్ అవినీతికి పాల్పడే పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.