: ఒంటె కోపానికి కోటి రూపాయల కారు బలి!


ఒంటెలు సాధారణంగా ప్రశాంతంగానే కనిపిస్తాయి. వాటికి కోపం రావడమన్నది చాలా తక్కువ. కానీ, ఉత్తరప్రదేశ్ లో ఓ లొట్టిపిట్ట విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శించి ఓ కారును తుక్కుతుక్కు చేయడం ఆశ్చర్యం కలిగించింది. కాన్పూర్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఖరీదైన తన ఎస్ యూవీలో విహరించాలని స్నేహితుడితో కలిసి సిటీ బయటికి వచ్చాడా బిజినెస్ మ్యాన్. అదే సమయంలో, అటుగా ఓ గుడ్డి ఒంటెను తీసుకుని దాని సంరక్షకుడు వస్తున్నాడు. ఏమైందోగానీ, ఉన్నట్టుండి ఒంటె పిచ్చిగా పరుగులు తీసింది. సదరు వ్యాపారవేత్త కారుకు ఎదురుగా వచ్చేసింది. దానిపై కూర్చున్న సంరక్షకుడు కాస్తా భయంతో దూకేశాడు. అప్పుడా ఒంటె కారును బలంగా తన్నడం ప్రారంభించింది. ఆ దాడిలో బానెట్, విండ్ స్క్రీన్ ధ్వంసమయ్యాయి. అనంతరం అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనిపై వాహన యజమాని మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితమే కోటి రూపాయలు వెచ్చించి కారు కొన్నానని, అదిప్పుడు తుక్కు కింద మారిందని వాపోయాడు. అయితే, కారు నుంచి తాను, తన స్నేహితుడు సురక్షితంగా బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాడు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఒంటె సంరక్షకుడు పప్పూను అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లో ఒంటెలను తిప్పడంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించాడంటూ అతనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News