: అహింస... మా డీఎన్ఏలోనే ఉంది: జపాన్ గడ్డపై మోడీ ఉద్ఘాటన
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అహింస అనేది భారత సమాజం డీఎన్ఏలోనే పాదుకొని ఉందని ఉద్ఘాటించారు. ఎన్పీటీ ఒప్పందంపై భారత్ సంతకం చేయడంలేదంటూ అంతర్జాతీయ సమాజం వెలిబుచ్చుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. టోక్యోలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... శాంతి, అహింసకు కట్టుబడి ఉండాలన్న నిర్ణయం భారతదేశ డీఎన్ఏలోనే ఉందని తెలిపారు. ఏ అంతర్జాతీయ ఒడంబడికకు అయినా, విధానానికి అయినా దీన్నే వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. "బుద్ధ భగవానుడి జన్మస్థలం భారత్. తథాగతుడు శాంతి కోసం పాటుపడ్డాడు, శాంతి కోసం కష్టాలు పడ్డాడు... ఇదే సందేశాన్ని భారత్ లో బలంగా విశ్వసిస్తారు" అని మోడీ వివరించారు. న్యూక్లియర్ నాన్-ప్రొలిఫిరేషన్ ట్రీటీ (ఎన్పీటీ) ఒప్పందంపై సంతకం చేయకుండా భారత్ అంతర్జాతీయ సమాజం విశ్వాసాన్ని ఎలా చూరగొంటుందన్న ప్రశ్నకు మోడీ పైవిధంగా జవాబిచ్చారు.