: పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళకే మనవాళ్ళ పెద్దపీట!
గ్లోబలైజేషన్ ప్రభావం గణనీయంగా ఉన్నా, ఇప్పటికీ సంప్రదాయాల పునాదిపై నడుస్తున్న దేశం భారత్. వివాహాలు, కుటుంబ వ్యవస్థ... ఈ రెండూ కూడా మనదేశాన్ని పాశ్చాత్య పోకడల ప్రభావంలో పూర్తిగా పడకుండా నియంత్రించగలుగుతున్నాయి. ఓవైపు స్వేచ్ఛా భావనలను మోసుకుని 'పడమటి గాలి' భీకరంగా వీస్తున్నా... భారతీయులు ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళకే మొగ్గు చూపుతుండడం విశేషం. ట్రూలీ మ్యాడ్లీ.కామ్ నిర్వహించిన సర్వే ఈ విషయం చెబుతోంది. అధ్యయనంలో భాగంగా మెట్రో నగరాలకు చెందిన 600 జంటలను ప్రశ్నించారు. వారిలో 69 శాతం అరేంజ్డ్ మ్యారేజీల ద్వారా ఒక్కటవ్వగా, 31 శాతం మంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారట. దీనిపై ట్రూలీ మ్యాడ్లీ.కామ్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ కుమార్ మాట్లాడుతూ, ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలకే యువత ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అయితే, భవిష్యత్తులో ప్రేమ వివాహాలదే పైచేయి అవుతుందని రాహుల్ అంటున్నారు. కొత్తతరం తమ భావాలు, అభిరుచులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని, లవ్ మ్యారేజీలకే ఓటు వేసే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.