: 'గోపీచంద్'కు గుడ్ బై చెప్పాలని సైనా నిర్ణయం


గోపీచంద్-సైనా నెహ్వాల్... నిన్నమొన్నటి వరకు గురుశిష్య బంధానికి ప్రతీకలుగా నిలిచారు. గోపీ శిష్యరికంలో సైనా ఎన్నో టైటిళ్ళు నెగ్గింది. ఇటీవల కాలంలో ఫామ్ లేమి, ఫిట్ నెస్ సమస్యలు సైనాను పునరాలోచనలో పడేశాయి. ఇప్పుడామె గోపీచంద్ శిక్షణ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఆసియా క్రీడలు సమీపిస్తున్న నేపథ్యంలో.... హైదరాబాదు నుంచి బెంగళూరు మకాం మార్చి భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద శిష్యరికం చేయాలని తలపోస్తోంది. గత కొంతకాలంగా సైనాకు చైనా క్రీడాకారిణుల చేతిలో పరాజయాలు తప్పడంలేదు. ప్రపంచస్థాయి టోర్నీల్లో కీలక మ్యాచ్ లలో చేతులెత్తేయడం రివాజుగా మారింది. దీనికితోడు భారత్ నుంచి పీీవీ సింధు వంటి వర్ధమాన షట్లర్లు దూసుకువస్తుండడం, ఆమెను తాజా నిర్ణయం దిశగా నడిపించినట్టు బ్యాడ్మింటన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతవారం డెన్మార్క్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ సందర్భంగా సైనా తన నిర్ణయాన్ని గోపీచంద్ కు తెలుపగా, అందుకు ఆయన 'గో ఎహెడ్' అంటూ ప్రోత్సహించారట కూడా. దీనిపై సైనా మాట్లాడుతూ, "అవును, బెంగళూరు వెళుతున్నాను. ఉబర్ కప్ సందర్భంగా విమల్ సర్ ఇచ్చిన సలహాలు ఎంతో లాభించాయి. అందుకే, ఆయన వద్ద శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను ఆసియా క్రీడల తర్వాత హైదరాబాద్ కు వచ్చేస్తాను. ఈ విషయం గోపీ సర్ కు కూడా చెప్పాను, ఆయన ఓకే చెప్పారు" అని వివరించింది. కాగా, ఈ జోడీ విడిపోవడం ఇదే మొదటిసారి కాదు. సైనా 2011లో భాస్కర బాబు వద్ద శిక్షణ తీసుకుంది. అయితే, మూణ్ణెల్లకే గోపీ వద్దకు చేరింది. ఇక, కెరీర్ లోనే బెస్ట్ అనదగ్గ ఒలింపిక్ కాంస్య పతక సాధనలో గోపీచంద్ పాత్ర ఎనలేనిదని సైనా పలు వేదికలపై ఘనంగా చెప్పింది.

  • Loading...

More Telugu News