: ఇప్పటిదాకా మోడీ పనితీరు అద్భుతం: వంద రోజుల పాలనపై భారతీయుల అభిప్రాయం
మంగళవారం నాటికి మోడీ పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు సర్వే సంస్థలు దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను రాబట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ వరుసలోనే టైమ్స్ గ్రూపు కూడా ప్రధానంగా నగరాలపై దృష్టి సారించి, సుదీర్ఘమైన సర్వేనే చేసింది. మోడీ వంద రోజుల పాలన అద్భుతంగా ఉందంటూ సర్వేలో పాల్గొన్న నగర జనం ఒప్పుకున్నారు. "ఇప్పటిదాకా మోడీ పాలన అద్భుతం. అయితే ద్రవ్యోల్బణం విషయంలో మోడీ సర్కారు చర్యలు మరింత మెరుగ్గా ఉండాల్సి ఉంది" అంటూ సర్వే జరిగిన ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ నగర వాసులు అభిప్రాయపడ్డారు. వంద రోజుల పాలనలో మోడీ, తిరుగులేని శక్తిగా ఎదగడంతో పాటుగా కొంతమేర నిరంకుశంగానూ వ్యవహరించారని ఈ సర్వే తేల్చింది. మోడీ సర్కారు పనితీరుపై 58 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఫరవా లేదని 34 శాతం మంది చెప్పారు. 6 శాతం మంది బాగా లేదంటే, అస్సలు బాగాలేదని రెండు శాతం మంది చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తన ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేస్తోందా? అన్న అంశానికి సంబంధించి 36 శాతం మంది తమ పూర్తి స్థాయి ఓటేయగా, ఆ మేరకు పనిచేస్తుందిలే అంటూ మరో 53 శాతం మంది ఓకే చెప్పేశారు. ఇక ఆ మాత్రమేమీ పనిచేయడం లేదని 11 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ వ్యవహారసరళిపై స్పందించిన నగర వాసులు, తిరుగులేని శక్తిగా పనిచేస్తున్నారని 51 శాతం మంది చెబితే, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. రెండు రకాలుగానూ మోడీ గోచరిస్తున్నారని ఏకంగా 25 శాతం మంది తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ద్రవ్యోల్బణం అదుపునకు మోడీ సర్కారు తీసుకున్న చర్యలపై 52 శాతం మంది పెదవి విరిచారు. దేశంలోని అన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొనేలానే మోడీ సర్కారు పయనిస్తోందని 56 శాతం మంది చెప్పారు. ఇదిలా ఉంటే, సర్వే జరిగిన నగరాల్లో హైదరాబాద్ తరహా నగరాలు మోడీకి ఫిదా అయిపోగా, కోల్ కతా వంటి నగరాలు మోడీ పనితీరుపై వ్యతిరేకంగా స్పందించాయి. హైదరాబాద్ తో పాటు ఫుణే, బెంగళూరు, అహ్మదాబాద్ లు మోడీకి జైకొట్టగా, కోల్ కతాతో పాటు చెన్నై మోడీ పనితీరుపై వ్యతిరేకంగా స్పందించడం గమనార్హం.