: యాపిల్ ను అధిగమించిన మైక్రోమ్యాక్స్!


దేశీయ మొబైల్ తయారీ రంగంలో పసికూన మైక్రోమ్యాక్స్, ప్రపంచంలోని పేరెన్నికగన్న యాపిల్ ను అధిగమించేసింది. భారత ట్యాబ్లెట్ విపణిలో 14 శాతం వాటాను చేజిక్కించుకున్న మైక్రోమ్యాక్స్, యాపిల్ ను మూడో స్థానంలోకి నెట్టేసింది. దీంతో మొబైల్ తయారీ రంగంలో ఇటీవలే కాలుమోపిన దేశీయ కంపెనీ తన సత్తా చాటింది. అంతేకాక ట్యాబ్లెట్ విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్న శ్యాంసంగ్ కంపెనీకి కూడా అతి చేరువలోకి వచ్చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ట్యాబ్లెట్ ల అమ్మకాల్లో శ్యాంసంగ్ ప్రస్తుతం 19 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో కొనసాగుతోంది. గతేడాది దాకా యాపిల్, ఈ రంగంలో శ్యాంసంగ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది అనూహ్యంగా మైక్రోమ్యాక్స్, యాపిల్ ను మూడో స్థానానికి నెట్టేసి సెకండ్ పొజిషన్ లో సగర్వంగా నిలిచింది. 9 శాతం మార్కెట్ వాటా కలిగిన యాపిల్, 14 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకున్న మైక్రోమ్యాక్స్ ను అందుకోవడం దాదాపూ అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు తొలి స్థానంలోని శ్యాంసంగ్ కంటే కేవలం 5 శాతం మార్కెట్ వాటా తేడాతో ఉన్న మైక్రోమ్యాక్స్, వచ్చే ఏడాది నాటికి అగ్రస్థానానికి ఎగబాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి ఐడీసీ వర్గాలు.

  • Loading...

More Telugu News