: ఆ ఒక్కటి తప్ప... జపాన్ పర్యటనలో మోడీ అన్నీ సాధించారు!
మోడీ జపాన్ పర్యటన అన్ని రకాలుగా సఫలమైంది... ఒక్క విషయంలో తప్ప! మోడీ జపాన్ పర్యటన చేసిన ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి... ఆ దేశంతో అణుశక్తి ఒప్పందం చేసుకోవడం. నూక్లియర్ టెక్నాలజీ విషయంలో జపాన్ సహాయం తీసుకుని ఈ రంగంలో భారత్ ను మరింత పటిష్టపరచాలని మోడీ భావించారు. అయితే ఈ విషయంలో మోడీకి కాస్త నిరాశ ఎదురైందనే చెప్పాలి. నూక్లియర్ టెక్నాలజీ సహకారంపై భారత్ తో ఒప్పందం చేసుకునే విషయంలో జపాన్ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. ప్రస్తుతానికి భారత్ కు అణుసహకారం అందించేందుకు జపాన్ అటు ఒప్పుకోకుండా... ఇటు నిరాకరించకుండా మధ్యస్థంగా ఉంది. భారత్ కు అణుసహకారం అందించే విషయంలో జపాన్ ప్రధాని షింజో అబే ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మోడీకి, తనకు మధ్య గత కొన్ని నెలలుగా సంభాషణలు జరుగుతున్నాయని... వీటిని రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో రెండు పక్షాలకు మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు.