: రైతు రుణమాఫీపై మరింత స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లేక్ వ్యూ అతిథి గృహంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి పంట రుణాల మాఫీ కటాఫ్ తేదీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2013 డిసెంబర్ 31 వరకు తీసుకున్న పంట రుణాలకు, వ్యవసాయం కోసం తీసుకున్న బంగారం రుణాలకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం జీవో నెం.181ను జారీ చేసింది. అంతేకాక గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతులకూ మాఫీ వర్తింపు చేస్తామని వివరించింది. వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామీణ, వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందని జీవోలో ఏపీ సర్కారు వెల్లడించింది. కాగా, ఆగస్టులో రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన జీవోలో రుణాల కటాఫ్ తేదీని ప్రభుత్వం పేర్కొనలేదు. దాంతో, ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అందుకోసమే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నేడు కొత్త జీవో జారీ చేసింది.