: 'మెట్రోమ్యాన్' శ్రీధరన్ ను ఏపీ మెట్రోప్రాజెక్టులకు పనిచేసేందుకు ఒప్పించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా 'మెట్రోమ్యాన్' ఇ.శ్రీధరన్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు ఈరోజు ట్విట్టర్లో ప్రకటించారు. ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త ఇ.శ్రీధరన్ ఏపీ మెట్రోరైల్ ప్రాజెక్టులకు సలహాదారుగా ఉంటారని చంద్రబాబు ట్విట్లర్లో వ్యాఖ్యానించారు. శ్రీధరన్ ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టులకు పనిచేసేందుకు ఒప్పుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ, వైజాగ్ లతో పాటు తిరుపతిలో కూడా మెట్రో రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు ఆయనకు సూచించినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా శ్రీధరన్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చినా నిరాకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో... ఏపీ మెట్రో ప్రాజెక్టులకు పనిచేసేందుకు శ్రీధరన్ ఒప్పుకోవడం విశేషమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల కానుంది. ప్రభుత్వ నిధులతో చేపట్టే భారీ ప్రాజెక్టులలో ఉన్నతాధికారుల నుంచి కాంట్రాక్టర్ల దాకా.. అయిన కాడికి అందరూ అందిన మేరకు దండుకోవడం మనదేశంలో సర్వసాధారణం. డబ్బులు తినేయడంతో పాటు... ప్రాజెక్టును టైమ్ కు పూర్తిచేయకుండా ఏళ్లకు ఏళ్లు సాగదీయడం కూడా మన వ్యవస్థలో పరిపాటే! ఈ అపప్రథను తొలిగిస్తూ... ఒక్క పైసా అవినీతి కూడా జరగనివ్వకుండా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్రోరైల్ నిర్మాణాన్ని గడువుతేదీకి మూడేళ్లు ముందే పూర్తిచేసి (పదేళ్ల భారీ ప్రాజెక్ట్ ను ఏడేళ్లకే పూర్తిచేశారు)చరిత్ర సృష్టించిన ఘనుడు ఇ.శ్రీధరన్. భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. భారతదేశపు తొలి మెట్రో ప్రాజెక్ట్...కోల్ కతా మెట్రో రైల్ రూపశిల్పి కూడా ఇ.శ్రీధరనే కావడం విశేషం.

  • Loading...

More Telugu News