: వరల్డ్ నెంబర్ వన్ జట్టుకు చారిత్రక షాకిచ్చిన జింబాబ్వే


ఆఫ్రికా దేశం జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా పసికూనగానే మిగిలిపోయింది. అడపాదడపా విజయాలు, దారుణ పరాజయాలు... ఇలా సాగుతోంది జింబాబ్వే క్రికెట్ ప్రస్థానం. నాణ్యమైన ఆటగాళ్ళు కాస్తా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ బాట పట్టగా, అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతోనే జింబాబ్వే మనుగడ సాగిస్తోంది. అయితే, ఈ జట్టు ఇటీవల కాలంలో మెరుగైన ఆటతీరు కనబరుస్తుండడం విశేషం. తాజాగా, వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా హరారేలో జరిగిన వన్డే మ్యాచ్ లో చిగుంబురా నాయకత్వంలోని జింబాబ్వే 3 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం, ఆతిథ్య జింబాబ్వే జట్టు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే జయభేరి మోగించింది. చిగుంబురా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులతో అజేయంగా నిలవగా, బౌలర్ ఉత్సేయా 30* పరుగులతో కెప్టెన్ కు సహకరించాడు. దీంతో, ఆ జట్టు 48 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. తద్వారా ఆసీస్ పై 31 ఏళ్ళ తర్వాత విజయం సాధించింది. చివరిసారిగా ఆసీస్ పై జింబాబ్వే నెగ్గింది 1983 వరల్డ్ కప్ లో.

  • Loading...

More Telugu News