: కరెంటు కావాలంటే రీఛార్జ్ చేసుకోవాల్సిందే!
కరెంటు కావాలా? అయితే రీఛార్జ్ చేసుకోవాల్సిందే. విద్యుత్ కు రీచార్జ్ ఏంటంటారా?... సెల్ ఫోన్, ఇంటర్నెట్ లాగే విద్యుత్ కు కూడా చార్జీలు ముందుగానే చెల్లించుకోవాలి, లేని పక్షంలో అంధకారంలో మగ్గిపోవాల్సి ఉంటుంది. అంటే, ప్రీపెయిడ్ అన్నమాట! ఎంత రీఛార్జ్ చేసుకుంటారో ఆ మొత్తానికి కరెంటును వాడుకున్న వెంటనే వినియోగదారుడి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ వెలుగులను పొందుతారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు కానున్న ప్రీ-పెయిడ్ విధానం. దీనిని జనంపై రుద్దేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ విధానానికి ఆమోదముద్ర వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, దొంగ కరెంటు వినియోగం కారణంగా విద్యుత్ సరఫరా లోపం, విద్యుత్ పంపిణీ(టీ అండ్ డీ)లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రీ-పెయిడ్ మీటర్ల విధానం అమలుకు కేంద్రం ఆదేశించింది. ఈ విధానం ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అమలు చేయాలని విద్యుత్ బోర్డు కార్యదర్శి అధికారులను ఆదేశించారు. తరువాత నెమ్మదిగా వినియోగదారులకు వర్తింపజేయాలని ఆయన సూచించారు. ప్రీ పెయిడ్ ఫోన్లలాగానే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పనిచేస్తాయి. ఒక్కో వినియోగదారుడికి ప్రీ పెయిడ్ సిమ్‌ను డిస్కంలు మంజూరు చేస్తాయి. ఈ సిమ్‌కు ప్రత్యేక నంబర్ ఉంటుంది. దీన్ని ముందుగా కావాల్సిన మొత్తంతో రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్‌ను మీటర్లో అమర్చిన వెంటనే కరెంటు సరఫరా అవుతుంది. ఈ సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంటు సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ సిమ్‌లో రీచార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా ప్రారంభమవుతుంది. దీని కారణంగా బకాయిల భారం తప్పుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. కానీ, దీనిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీని కారణంగా విద్యుత్ అధికారులు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని మండిపడుతున్నారు. టెలికాం సంస్థలు అర్థం లేని ఆఫర్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నట్టుగా... విద్యుత్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, అదనపు సుంకం అంటూ విద్యుత్ సంస్థలు కూడా డబ్బులు దోచేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక, సాధారణ మీటర్లు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకే లభిస్తుండగా, ప్రీ పెయిడ్ మీటర్లకు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని మండిపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం గృహ విద్యుత్ కనెక్షన్లే రెండు కోట్లకుపైగా ఉన్నాయి. ఒక్కో మీటరుకు సగటున రూ. 6 వేలు లెక్కించినా... రూ. 12 వేల కోట్లకుపైగా నిధులను మీటర్ల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. దీంతో, ఈ భారం చార్జీల పెంపు పేరిట జనంపైనే వేస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది.