: తెలుగు సంవత్సరాదికంతా మెట్రో పరుగులు
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు వచ్చే ఉగాది నాటికంతటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలోని 200 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్ మెట్రో రైలు సేవలు వాటన్నింటికీ విభిన్నంగా ఉండనున్నాయని ఆయన చెప్పారు. పెను సవాళ్లను ఎదుర్కొని కార్యరూపం దాల్చిన హైదరాబాద్ మెట్రో రైలు ‘గ్లోబల్ ఇంజినీరింగ్ అవార్డు’ను కైవసం చేసుకుందని ఆయన వెల్లడించారు. సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు ప్రాజెక్టును తీర్చిదిద్దామన్నారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. మెట్రో రైళ్లలో అన్ని వేళల్లో మహిళలు నిర్భయంగా ప్రయాణం చేసే వీలుందని ఆయన తెలిపారు. సంగీత కచేరీలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లను మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నట్లు రెడ్డి వెల్లడించారు.