: పాపం! ఆ రిటైర్డు పోలీసు పాలిట భార్యాబిడ్డలే విలన్లు!
ఆయనో రిటైర్డు పోలీసు. కుటుంబం కోసం ఏళ్ళ తరబడి కష్టనష్టాల కోర్చిన ఆయన, పదవీవిరమణ తర్వాత హాయిగా బతుకుదామని ఆశించారు. కానీ, పరిస్థితి తిరగబడింది. భార్యాబిడ్డలే ఆయన పాలిట విలన్లుగా మారారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్ (60) అనే వ్యక్తి పోలీసు శాఖలో 35 ఏళ్ళపాటు పనిచేసి రిటైరయ్యారు. కొడుకులు హెచ్ పీ, ఇన్ఫోసిస్ సంస్థల్లో పనిచేస్తున్నారు. కాగా, వెంకటేశ్ కు పదవీ విరమణ సందర్భంగా రూ.20 లక్షలు లభించాయి. వీటిపై కుటుంబ సభ్యుల కన్నుపడింది. ఆ సొమ్ము తమకు ఇవ్వాల్సిందేనని భార్య, కొడుకులు వెంకటేశ్ ను సతాయించసాగారు. ఆయన నిరాకరించడంతో వారిలోని రాక్షసత్వం మేల్కొంది. వెంకటేశ్ ను ఓ మంచానికి కట్టేసి, గదిలో పడేసి తాళం వేశారు. ఎప్పుడో కాసింత ఆహారం పడేసేవారు! పాపం, ఆ పెద్ద వయసులో ఆకలికి మలమల మాడిపోయాడా రిటైర్డు పోలీసు. అయినా, అతని కుటుంబ సభ్యులకు జాలి కలగలేదు. తన అన్న సరిగా కనిపించకపోయేసరికి వెంకటేశ్ తమ్ముడికి అనుమానం వచ్చి ఆరా తీశాడు. చివరికి అతడి అనుమానం అన్న కుటుంబ సభ్యులపైకే మళ్ళింది. మరేమీ ఆలోచించకుండా, నేరుగా కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో, సెర్చ్ వారంట్ తో పోలీసులు వచ్చి ఇంట్లో వెతకగా, సదరు భార్యాబిడ్డల నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం ఆ కిరాతక భార్య, కనికరంలేని పుత్రులు కటకటాల వెనక్కి చేరారు