: అలాగైతే, అది పాకిస్థాన్ ఎందుకు అవుతుంది!
పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం హింసాత్మకంగా మారింది. మొన్నటికి మొన్న సైన్యం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరిస్తామని, ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పిన విపక్షం తాజాగా ఆందోళనకే మొగ్గుచూపింది. అటు, ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా కఠిన చర్యలకు నడుం బిగించారు. సైన్యం జోక్యంతో శాంతి నెలకొంటుందని అందరూ భావించినా, పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన సందర్భంగా ఇద్దరు నిరసనకారులు మృతి చెందడంతో ఇస్లామాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ చర్యలతో ఆగ్రహించిన పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ చనిపోయేంత వరకు పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. "ఈ అక్రమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకంతో పాటు ప్రజా సేవకులు, అధికారులు, పోలీసులు తిరగబడాలని అభ్యర్థిస్తున్నా" అని పేర్కొన్నారు. స్వేచ్ఛా? లేక మరణమా? తేల్చుకుందామని ఆయన అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గద్దెనెక్కారని, అందుకే ప్రధాని నవాజ్ షరీఫ్ పదవిని వీడాలంటూ... ఇమ్రాన్, మతగురువు తాహిర్-ఉల్-ఖాద్రీ ప్రజా ఉద్యమం చేపట్టడం తెలిసిందే. షరీఫ్ కు పలు అల్టిమేటంలు ఇచ్చినా, ఆయన చలించలేదు. సైన్యం కూడా ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలూ విఫలమైనట్టు తాజా సంఘటనలు చెబుతున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ లోని షరీఫ్ నివాసాన్ని ముట్టడించగా, పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 450 మంది వరకు గాయపడ్డారు. దీంతో, పాకిస్థాన్ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు భగ్గుమన్నాయి.