: తుమ్మలకు కేసీఆర్ 'డబుల్ బొనాంజా' ఆఫర్... ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఖాయం!
టీడీపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని తుమ్మల నాగేశ్వరరావు నిన్న తెంచుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన నిన్న ప్రకటించారు. ఇక తుమ్మల టీఆర్ఎస్ లో చేరడం లాంచనం కానుంది. సెప్టెంబర్ 5వ తారీఖున కేసీఆర్ సమక్షాన... అత్యంత ఘనంగా తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమం ద్వారా ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. సుమారు 2వేల వాహనాల భారీ కాన్వాయ్ తో... వేలాది మంది అనుచరులతో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. కాగా, తుమ్మలను టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ 'డబుల్ బొనాంజా'ను ఆఫర్ చేశారు. ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కూడా కేసీఆర్ ఆయనకు ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో బడ్జెట్ సమావేశాల్లోపు జరగబోయే తెలంగాణరాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తుమ్మలను ఆహ్వానించడంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో తెరాసకు సరైన క్యాడర్ తో పాటు పటిష్టమైన నాయకత్వం కూడా లేదు. ఈ జిల్లాలో ఒక బలమైన నాయకుడి అవసరాన్ని ఆయన గుర్తించారు. అలాగే, తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గ నాయకుడెవరూ టీఆర్ఎస్ లో లేకపోవడం ఆ పార్టీకి కొంత లోపంగా మారింది. ఈ రెండు ప్రయోజనాలను ఆశించి తుమ్మలను కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మలకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా బలమైన అనుచరవర్గం ఉంది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబులతో పాటు దాదాపు 15మంది జడ్పీటీసీలు... వందలమంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆయనతో పాటు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి రాకతో ఖమ్మం జిల్లాలో తెరాస బలమైన రాజకీయపక్షంగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.