: మెదక్ ఉపఎన్నికల్లో విజయం మాదే: హరీశ్ రావు
మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో విజయం తమదేనని టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ధీమాగా చెప్పారు. బరిలో నిలిచిన మిగిలిన పార్టీలన్నీ రెండో స్థానానికే పోటీ పడుతున్నాయని ఆయన ఆదివారం నాటి ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంతో పాటు, హైదరాబాద్ లో గవర్నర్ పాలనకు మొగ్గుచూపిన కేంద్రానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజనే వద్దని వాదించిన జగ్గారెడ్డికి అసలు ఓట్లడిగే హక్కే లేదన్నారు. జగ్గారెడ్డిని బరిలో దింపడం ద్వారా బీజేపీ తమ విజయాన్ని మరింత సులభతరం చేసిందన్నారు. మూడు నెలల క్రితం ఓటమిపాలైన సునీతా లక్ష్మారెడ్డిని అంతలోనే ప్రజలెలా ఆదరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజార్టీ కంటే అధికంగా ఓట్లు సాధిస్తామన్నారు.