: గుజరాత్ మహిళ పట్ల అనుచిత ప్రవర్తనకు ’హీత్రూ‘పై భారీ జరిమానా


సోదరి, సోదరుడిని చూసేందుకు బ్రిటన్ వెళ్లిన గుజరాతీ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన హీత్రూ (లండన్) విమానాశ్రయ సిబ్బందిపై భారీ జరిమానా విధిస్తూ ఆ దేశ హైకోర్టు తీర్పు చెప్పింది. అకారణంగా మహిళను అవమానపరచడమే కాక ఐదు రోజులుగా నిర్బంధించిన కారణంగా ఆమెకు 1.25 లక్షల పౌండ్లను పరిహారంగా చెల్లించాలని ఆ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లో కచ్ జిల్లా గోడ్పార్ గ్రామానికి చెందిన రాధా పటేల్, బ్రిటన్ లో స్థిరపడ్డ తన సోదరి, సోదరుడిని చూసేందుకు 2011లో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నలతో సతమతం చేశారు. హిందీతో పాటు ఆంగ్లంలోనూ సరిగ్గా మాట్లాడటం కూడా రాదని హేళన చేసిన అధికారులు, ఆమె పాస్ పోర్టును లాగేసుకున్నారు. అనంతరం సోదరి, సోదరుడికి సమాచారం ఇవ్వకుండానే ఐదు రోజుల పాటు ఆమెను నిర్బంధించారు. ఎట్టకేలకు వారి బారి నుంచి విముక్తి లభించిన తర్వాత భారత్ తిరిగి వచ్చిన ఆమె విమానాశ్రయ అధికారులపై కేసు దాఖలు చేశారు. దీనిపై ఆ దేశ కోర్టు సుదీర్ఘ విచారణ జరిపి తుది తీర్పును వెలువరించింది. బాధితురాలిని తీవ్ర మానసిక వేదనకు గురి చేయడమే కాక, అక్రమంగా నిర్బంధించినందున ఆమెకు 1.25 లక్షల పౌండ్ల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News