: బైబిల్ ను చింపి, మూత్ర విసర్జన చేసినందుకు కటకటాల పాలయ్యాడు
క్రైస్తవుల పవిత్ర గ్రంధం బైబిల్ ను చింపి, దానిపై మూత్ర విసర్జన చేసిన నేరానికి ఓ ఆరిజోనా యువకుడు కటకటాల పాలయ్యాడు. తనను తాను 'డార్క్ లార్డ్'గా సంబోధించుకుంటున్న ఎరిక్ మినరాల్ట్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్ లో గూడు లేని నిర్వాసితుల కోసం ఓ క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న షెల్టర్ ఎదుట ఎరిక్ ఈ చర్యకు ఒడిగట్టాడు. క్రైస్తవ మిషనరీకి చెందిన ఓ ప్రతినిధి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు కాలి, తడిచిపోయిన బైబిల్ తో సహా ఎరిక్ ను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. దీనిపై కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.