: ఈసారి చంద్రుడూ లేడు... నీలాపనిందలూ లేవు!
భాద్రపద శుద్ధ చవితినాడు చందమామను చూస్తే అశుభం. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవని, ఏదో ఒక అపనింద భరించాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ లెక్కన తెలుగు ప్రజలకు నీలాపనిందల భయం తొలగిపోయింది. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు చంద్రుడ్ని చూడకుండా వరుణుడు చక్రం అడ్డేయడంతో నీలాపనిందల బాధ తప్పింది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురవడంతో అసలు చవితి చంద్రుడే కనిపించలేదు! ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సాయంత్రం నుంచి మబ్బు బాగా పట్టి తెల్లవారుజాము వరకు వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది. చాలాచోట్ల గణనాధుని మండపాలు తడిసిపోయాయి. అయినా భక్తులు అలాగే వర్షంలో తడుస్తూనే విఘ్ననాయకుడికి పూజలు చేశారు. ఈసారి మాత్రమే వినాయక చవితికి చంద్రుడు కనిపించలేదని, ప్రతిసారీ తప్పనిసరిగా వస్తాడని పలువురు అర్చకులు చెప్పారు. చవితి రోజు ఏదో ఒక సందర్భంగా చిన్న వర్షం కురిసి సాయంత్రానికి మబ్బులు వీడుతాయి. అయితే, ఈసారి మాత్రం నిండా మబ్బు పట్టడంతో అసలు చంద్రోదయమే కాలేదు!