: మరింత బలపడనున్న అల్పపీడనం... రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి తోడు, ఉపరితల ఆవర్తనం కూడా స్థిరంగా కదులుతోందని వెల్లడించింది. అంతేకాకుండా, కోస్తాంధ్ర, తెలంగాణల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రకటించింది. వీటి ప్రభావంతో, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని... కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.