: సౌతాఫ్రికాపై హ్యాట్రిక్ సాధించి రికార్డులకెక్కిన ఉత్సేయ
సౌతాఫ్రికా-జింబాబ్వే-ఆస్ట్రేలియా ముక్కోణపు వన్డే సిరీస్ లో జింబాబ్వే 'వివాదాస్పద' ఆఫ్ స్పిన్నర్ ఉత్సేయ రికార్డు సృష్టించాడు. అంతుచిక్కని బౌలింగ్ యాక్షన్ తో ప్రత్యర్థుల పని పడుతున్న ఉత్సేయ సౌతాఫ్రికాకు చుక్కలు చూపించాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ ఉత్సేయ సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఎడ్డో బ్రాండెస్ తరువాత వన్డేల్లో జింబాబ్వే తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ గా ఉత్సేయ రికార్డు పుటలకెక్కాడు. కాగా, ఉత్సేయ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందంటూ ఐసీసీ అతనిని పరిశీలనలో ఉంచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, ఉత్సేయ విసిరే 'షూటర్' (ఆఫ్ స్పిన్ లో వేగంగా విసిరే బంతి) పైనే అంపైర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ జింబాబ్వే స్టార్ కు నిపుణుల సమక్షంలో బౌలింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.