: ఆ వన్డే మ్యాచ్ విద్యార్థుల మధ్య గొడవ రేపింది!
పాకిస్థాన్-శ్రీలంక వన్డే మ్యాచ్ పంజాబ్ లోని స్వామి పరమానంద్ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది. చండీగఢ్ సమీపంలోని లాల్రూకు దగ్గరలో ఉన్న ఈ కాలేజీలో కాశ్మీర్ విద్యార్థులు కూడా చదువుతున్నారు. ప్రస్తుతం పాక్ జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా ఈ నెల 26న ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. అందులో శ్రీలంకే నెగ్గింది. అయితే, ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే సందర్భంలో హాస్టల్లో ఉన్న విద్యార్థుల మధ్య వివాదం ఏర్పడింది. కాశ్మీర్ విద్యార్థులు పాక్ అనుకూల నినాదాలు చేయడాన్ని మిగతా విద్యార్థులు భరించలేకపోయారు. దీంతో, విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కలబడ్డారు. ఈ గొడవలో 12 మందికి గాయాలయ్యాయి. దీనిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కాలేజీలో 200 మంది వరకు కాశ్మీర్ విద్యార్థులు ఉన్నారు.