: స్టార్ హోటల్ లో ఉన్నాడు, స్టార్ ఆసుపత్రిలో చేరాడు...బిల్లిచ్చేసరికి 'గజని' అయిపోయాడు!


గజిని సినిమా గుర్తుందా? ప్రతి పావుగంటకి హీరో అన్ని విషయాలు మర్చిపోతుంటాడు... అలాంటి సంఘటనే హైదరాబాదులో చోటు చేసుకుంది. ఇందులోని వ్యక్తి ప్రతి పావుగంటకి కాదు కానీ బిల్లు వస్తే చాలు తనని తాను మర్చిపోతుంటాడు. ఈ ఆసక్తికర కథనం వివరాల్లోకెళితే... వారం క్రితం పూణె నుంచి ఓ యువకుడు హైదరాబాద్ వచ్చాడు. సామ్రాట్ వైశ్రాయ్ హోటల్ లో దిగాడు. చూసేందుకు హుందాగా ఉండి, హిందీ, ఇంగ్లీషుల్లో అదరగొట్టాడు. నాలుగు రోజులు బస చేశాడు, బిల్లు చేతిలో పెట్టేసరికి నేనిక్కడ లేకుండా ఎందుకు బిల్లు కట్టాలంటూ ఎదురుతిరిగాడు. దీంతో హోటల్ సిబ్బంది వదిలేశారు. గుండెపోటు వచ్చిందంటూ అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. అతని డాబూదర్పం చూసిన ఆసుపత్రి సిబ్బంది రెండు రోజులపాటు డీలక్స్ రూంలో సకల మర్యాదలతో సేవలు చేశారు. ఆరోగ్యానికి ఇబ్బంది లేదంటూ ఆపోలో సిబ్బంది 29 వేల రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. దీంతో వెంటనే ‘బిల్లు నాకెందుకిస్తున్నారు? అసలు నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు?’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు అవాక్కయ్యాయి. ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగదీష్ సింగ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని విచారించారు. అతని పేరు సామ్రాట్ గుప్తా (35) అని, స్వస్థలం పూణే అని, ఎంకామ్ చదివాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇదే తీరుతో మరికొన్ని నగరాల్లో అతను పలువుర్ని ఇబ్బంది పెట్టినట్టు గుర్తించారు. దీంతో అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో మానసిక చికిత్సాలయంలో ప్రవేశపెట్టి అతని మానసిక స్థితి తెలుసుకోవాలని నిర్ణయించారు. సామ్రాట్ మానసిక రోగా? బిల్లు ఎగ్గొట్టడానికి ఆడుతున్న నాటకమా? అనేది అప్పటి వరకు తేలేలా లేదు.

  • Loading...

More Telugu News