: సభలో సవాళ్లు, ప్రతి సవాళ్లు... అసెంబ్లీ సోమవారానికి వాయిదా
అసెంబ్లీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై వైఎస్సార్సీపీ సభ్యురాలు రోజా, టీడీపీ సభ్యుల మధ్య కాసేపు వివాదం జరిగింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ పై చర్చ కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ సభను 10 నిమిషాల సేపు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత డ్వాక్రా రుణమాపీపై జరిగిన చర్చలో అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో, సభ సోమవారానికి వాయిదా పడింది.