: ‘రభస’ సినిమా వివాదంలో కొత్త ట్విస్ట్
‘రభస’ సినిమా పేరుకు తగ్గట్టే... విడుదలకు ముందే రభస సృష్టించింది. ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్, మంచు లక్ష్మి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 'మంచు ఎంటర్ టైన్ మెంట్'కి చెందిన ‘గంధర్వ మహల్’లో ‘రభస’ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సెట్ ను వాడుకున్నందుకు నిర్మాత సురేష్ రూ.58 లక్షలు ఇవ్వాలని, అయితే ఆ డబ్బును తమకు ఇంతవరకు ఇవ్వలేదని మంచులక్ష్మి ఆరోపిస్తోంది. అయితే, నిర్మాత బెల్లంకొండ సురేష్ చెబుతున్న వెర్షన్ మరోలా వుంది. దీనిపై ఆయన మాట్లాడుతూ... మోహన్ బాబుకు ఇంతకు ముందు తాను రూ.10 లక్షలు ఇచ్చానని, అలాగే మంచు మనోజ్ కు ఓ సినిమా కోసం రూ.30 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చానని చెప్పారు. అయితే, ఆ సినిమా సెట్స్ కు వెళ్లకుండానే ఆగిపోయిందని, మంచు మనోజ్ ఆ డబ్బులను తనకు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. మరి, ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. కాగా, ‘రభస’ ఈ నెల 29న విడుదలవుతున్న విషయం తెలిసిందే.