: రైనా షాట్లు సూపర్: ధోనీ
రెండో వన్డేలో గెలుపు ద్వారా టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో విజయాల కరవు తీర్చుకుంది. కార్డిఫ్ వన్డే విజయంలో కీలకపాత్ర పోషించిన సురేశ్ రైనాపై కెప్టెన్ ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. కీలకదశలో రైనా ఎంతో వేగంగా ఆడాడని, ముఖ్యంగా సాధికారికమైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్ల పనిబట్టాడని తెలిపాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదో వికెట్ కు రైనా-ధోనీ 144 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించడం తెలిసిందే. సెంచరీతో విరుచుకుపడిన రైనా సరిగ్గా 100 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీనిపై ధోనీ మాట్లాడుతూ, రైనా ప్రదర్శన ఇంగ్లండ్ కు పరాజయం మిగిల్చిందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఇన్నింగ్స్ తో రైనాకు వరల్డ్ కప్ బెర్తు ఖాయమైనట్టేనా..? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ, అతడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మరోరకంగా ప్రశ్నించి ఉండేవాళ్ళని చురకంటించాడు.