: రైల్వే మంత్రి సదానంద కుమారుడిపై చీటింగ్ కేసు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై అత్యాచారం, చీటింగ్ కింద బెంగళూరులోని ఆర్ టీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కార్తీక్ తో తనకు వివాహం అయిందంటూ మైత్రేయ అనే కన్నడ నటి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు, ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడిస్తూ, ఈ ఏడాది మే 8వ తేదీన సదానంద కుమారుడు, తాను తొలిసారి ఒకరికొకరు పరిచయం అయ్యామని, తర్వాత మంచి స్నేహితులమయ్యామని తెలిపింది. ఆ తర్వాత తాము ప్రేమించుకోవడంతో జూన్ 5న కార్తీక్ తనను వివాహం కూడా చేసుకున్నట్లు చెప్పింది. కానీ, కార్తీక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. కాబట్టి, మంత్రి కుటుంబం తనను కోడలిగా అంగీకరించాలని డిమాండ్ చేసింది. తాజాగా మంత్రి కుమారుడికి వేరే అమ్మాయితో కర్ణాటక కొడగు జిల్లాలోని కుషల్ నగర్ లో నిశ్చితార్థం అయింది. ఈ నేపథ్యంలో నటి మైత్రేయ ఈ విషయాలు బయటపెట్టింది. అటు, ఈ వ్యవహారంపై మంత్రి సదానంద మాట్లాడుతూ, "దీనంతటి వెనుక ఏదో కుట్ర ఉంది. నేను చాలా బాధపడుతున్నా. నా జీవితం తెరిచిన పుస్తకం. అబద్ధమాడను, ప్రజలను చీట్ చేయను. ఇలాంటి ఆరోపణలతో షాక్ కు గురయ్యా. వెంటనే నా కొడుకుతో మాట్లాడతాను. ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తోందని భావిస్తున్నాను. ఇందులో నన్ను బలిపశువును చేస్తున్నారు" అన్నారు. మైత్రేయ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తన తండ్రి చాలా బాధ్యతగల వ్యక్తని, అలాంటప్పుడు ఆయనకు మచ్చ తెచ్చేలా తానిలా ఎందుకు చేస్తానని సదానంద కుమారుడు కార్తీక్ అంటున్నాడు.