: కేసీఆర్ కు సరైన మొగుడు జగ్గారెడ్డే!: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర టీడీపీ యువనాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. నిజాయతీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రక్కనబెట్టి... తనకు కోట్ల రూపాయలు ఇచ్చిన వారికే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మెదక్ జిల్లాలోనే గతంలో బీబీ పాటిల్.... ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదాహరణలని ఆయన వివరించారు. మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ బండారాన్ని బయటపెడతానని రేవంత్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు మెదక్ లో కేసీఆర్ కు మొగుడు లాంటి జగ్గారెడ్డిని బీజేపీ-టీడీపీ కూటమి తరపున అభ్యర్థిగా నిలబెట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇటీవల సింగపూర్ వెళ్లింది... సింగారించుకోవడానికేనని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను కేసీఆర్ సింగపూర్ చేయలేరని... అయితే హైదరాబాద్ ను అమ్మి సింగపూర్ ను కొనగల సత్తా ఆయనకు ఉందని రేవంత్ చురకలంటించారు.