: రాజధాని ఎఫెక్ట్: విజయవాడలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్!
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ వాసులకు కొత్త కష్టాలొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడలో ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జామ్ లతో కిటకిటలాడుతోంది. విజయవాడను తాత్కాలక రాజధాని చేయడంతో... శాశ్వత రాజధాని కూడా విజయవాడే అవుతుందని బలంగా వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో... ట్రాఫిక్ ఒకేసారి అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ ఇంతటి ట్రాఫిక్ ను చూడకపోవడంతో విజయవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా గత ఆరునెలలుగా విజయవాడలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్రంగా మారడంతో పాటు ఇటీవల కాలంలో విజయవాడలో అన్నిరకాల వ్యాపార లావాదేవీలు ఎక్కువవడం ట్రాఫిక్ పెరగడానికి ముఖ్యకారణమని విజయవాడ్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. తయారీ రంగంలో ఉన్న అన్ని ప్రముఖ కంపెనీలు విజయవాడలో గోడౌన్లు ఏర్పాటు చేస్తుండడం... కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండడం కూడా విజయవాడలో రద్దీ పెరగడానికి దోహదపడ్డాయి. కొంతకాలం క్రితం వరకు విజయవాడలో లక్షన్నర వాహనాలు(టూవీలర్ అండ్ ఫోర్ వీలర్ తో కలిపి) మాత్రమే ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఆ సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీంతో రహదారుల విస్తరణ అనివార్యమైనా ప్రస్తుతం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోడ్లను విస్తరించడానికి ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ దగ్గర నిధులు లేవు. దీనికి తోడు విజయవాడ మొత్తానికి కలిపి 34 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా, ప్రస్తుతం వాటిలో 16 సిగ్నళ్లు పనిచేయడం లేదు. దీంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు తలనొప్పిగా మారింది. నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం కనీసం నాలుగున్నర వేల మంది పోలీసులు అవసరమైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 1700 మంది మాత్రమే. అడిషినల్ డిజి స్థాయికి బెజవాడ కమిషనరేట్ ను అప్-గ్రేడ్ చేసినా సిబ్బందిని మాత్రం పెంచలేదు. అయితే త్వరలోనే అన్ని పరిస్థితులను చక్కదిద్దుతామని విజయవాడ పోలీస్ కమిషనర్ చెబుతున్నారు.