: పొరపాటున షూటింగ్ ఇన్ స్ట్రక్టర్ ను కాల్చేసిన బాలిక
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ళ బాలిక పొరపాటున తన షూటింగ్ ఇన్ స్ట్రక్టర్ నే కాల్చివేసింది. దీంతో, ఆ గురువు ప్రాణాలు వదిలాడు. ఆరిజోనాలో చార్లెస్ వకా (39) ఓ షూటింగ్ ఇన్ స్ట్రక్టర్. అయితే, వైట్ హిల్స్ రేంజిలో తన శిష్యురాలికి హై పవర్ సబ్ మెషీన్ గన్ పేల్చడమెలాగో నేర్పిస్తుండగా, ఆ బాలిక తుపాకీపై నియంత్రణ కోల్పోయింది. దీంతో, తుపాకీ పేలగా బుల్లెట్ వకా తలలోకి దూసుకుపోయింది. అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా లాస్ వేగాస్ తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. కాగా, సదరు బాలిక తల్లిదండ్రులు కూడా షూటింగ్ రేంజి వద్దే ఉన్నారు. తమ కుమార్తె షూటింగ్ నేర్చుకుంటుండడాన్ని వారు వీడియోలో చిత్రీకరించారు. దాంతో, ఈ ఘటన కూడా కెమెరాకు చిక్కింది.