: అసెంబ్లీలో వైసీపీని టీడీపీ తొక్కే ప్రయత్నం చేస్తోంది: జగన్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారం పక్షం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. బడ్జెట్ పై అసెంబ్లీలో ఆరురోజుల చర్చ జరగాల్సి ఉండగా... కేవలం నాలుగు రోజులకే కుదించారని జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సాధారణంగా ప్రజలకిచ్చిన హామీలను... ప్రజాసమస్యలను ప్రస్తావించేది ప్రతిపక్ష పార్టీనే అని... కానీ ప్రతిపక్షమైన తమకు ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు స్పీకర్ తగిన సమయం కేటాయించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ రోజు తన ప్రసంగం ముగించడానికి మరో అరగంట సమయం ఇవ్వాలని వేడుకున్నా, స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. అదే, టీడీపీ సభ్యులకు మాత్రం స్పీకర్ ఎంత సమయం కావాలంటే అంత సమయం కేటాయిస్తున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు ఐదేళ్ల క్రితం చనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టడం తప్ప... వేరే పనిలేకుండా పోయిందన్నారు. అసెంబ్లీలో వైసీపీని టీడీపీ తొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.