: 'వరల్డ్ బెస్ట్ డైట్' ఇదేనంటున్న పరిశోధకులు
మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఫలానా ఆహారం తీసుకోవాలని నిన్నమొన్నటి వరకు ఇతమిద్ధంగా ఎవరూ చెప్పలేదు. కొన్ని రకాల లోపాలకు కొన్ని రకాల ఆహారాలే బెస్ట్ అని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. గోంగూర తింటే ఐరన్ లభిస్తుందని, పాలలో విటమిన్ ఏ, కాల్షియం పుష్కలంగా ఉంటాయని, పప్పు దినుసుల్లో మాంసకృత్తులు సమృద్ధిగా లభ్యం అవుతాయని... ఇలాగన్నమాట. వాటితో పర్ఫెక్ట్ డైట్ చార్ట్ ను మాత్రం రూపొందించలేకపోయారు. కోపెన్ హేగెన్ యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం తాము వరల్డ్ బెస్ట్ డైట్ ఫార్ములా రూపొందించామని చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే... హై ప్రొటీన్ ఆహారంతో, తక్కువస్థాయిలో కార్బోహైడ్రేట్లు కలిగి ఉండే ఆహారాన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించ వీలుంటుందని తెలిపారు. ఈ కాంబినేషన్ అన్ని విధాలా శ్రేయస్కరం అని, శరీరతత్వానికి తగిన విధంగా శక్తి అందుతుందని పేర్కొన్నారు. ఈ బెస్ట్ డైట్ లో భాగంగా తాజా కూరగాయలు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, బఠాణీలు, వేరుశనగలు, డైరీ ఉత్పత్తులు, ధాన్యంతో తయారైన బ్రెడ్, బార్లీ తీసుకోవడం మేలని చెబుతున్నారు. వీటి ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమపాళ్ళలో అందుతాయట.