: ఇలాంటి గొడవలు విమానాల్లోనూ జరుగుతాయి!
కూర్చునే సీట్ల విషయంలో గొడవలు బస్సులు, రైళ్ళలో సర్వసాధారణం. ఒక్క సీటు కోసం ఇద్దరు పోటీపడడం, వెనుక సీట్లో కూర్చున్న వారు ముందు సీట్లను కాళ్ళతో తన్నడం... తత్ఫలితంగా వివాదాలు రేగడం తెలిసిందే. విమానాల్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతాయన్న దానికి ఉదాహరణే ఈ సంఘటన. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం న్యూయార్క్ నుంచి డెన్వర్ వెళుతోంది. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ముందు సీటు వెనక్కి వాల్చే వీల్లేకుండా దానికో పరికరం బిగించాడు. దాని పేరు 'నీ డిఫెండర్'. అయితే, ముందు సీట్లో కూర్చున్న మహిళ తన సీటు వెనక్కివాలకపోవడంతో పైకిలేచి చూసింది. సీటుకు ఏమైందోనని పరిశీలించగా, దానికి నీ డిఫెండర్ ఫిట్ చేసి ఉండడాన్ని గమనించింది. అతనికి చెప్పిచూడగా, దాన్ని తొలగించేందుకు ససేమిరా అన్నాడు. విమాన సిబ్బంది చెప్పినా అతడు మొండిపట్టు వీడలేదు. ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి స్థలం కావాలని, అందుకే ఆ పరికరాన్ని బిగించానని చెప్పాడు. విమానాల్లో ఇలాంటి పరికరాల వినియోగం కుదరదని చెప్పినా వినకపోగా, ముందు సీటు మహిళపై వాగ్వివాదానికి దిగాడు. దీంతో, ఆగ్రహించిన ఆ మహిళ ఒక్కసారిగా గ్లాసులోని నీళ్ళను అతడి ముఖంపైకి విసిరికొట్టింది. ఇద్దరి అరుపులతో గొడవకాస్తా మరింత ముదిరింది. ఇక, ఇది చల్లారే వివాదం కాదని తెలుసుకున్న పైలెట్లు విమానాన్ని చికాగోకు మళ్ళించి, వారిద్దరినీ అక్కడ దింపేశారు. పోలీసులు ఆ ప్రయాణికులిద్దరినీ అదుపులోకి తీసుకోవడంతో, విమానం ఆలస్యంగా గమ్యస్థానానికి బయల్దేరింది.